Harish Rao | త్రినేత్ర.న్యూస్ : రైతులకు సరిపడ కరెంట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి చెప్పుడేమో 24 గంటల కరెంట్ అని.. ఇచ్చుడు మాత్రం 12 గంటలు మాత్రమే అని ధ్వజమెత్తారు. 24 గంటల కరెంట్ రావడం లేదని రైతులు మొర పెట్టుకోగా నర్సాపూర్, రెడ్డిపల్లి సబ్ స్టేషన్‌ను ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీశ్‌రావు అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. నర్సాపూర్ సబ్ స్టేషన్లో లాగ్ బుక్ చూస్తే స్పష్టంగా అర్థమైపోయింది. 12 గంటల కరెంటే వస్తుందని. చెప్పుడు 24.. ఇచ్చుడు 12 గంటలు. ఈ అధికారి మీద చర్య తీసుకోవడం తప్పు. ఓ లైన్మెన్ను, ఏఈని సస్పెండ్ చేయడం తప్పు. మీదికెళ్లి కరెంట్ ఇస్తే ఆయన ఇయ్యడ ఏంది.. నువ్వు మీదికెళ్లి ఏం ఆదేశాలు ఇస్తే అధికారులు అది చేస్తరు. కరెంట్‌ను ఏమన్న తింటరా.. దాచుకుంటరా.. పాపం ఆపరేటర్, ఏఈ ఏం చేస్తరు. ఆపరేటర్ అయినా ఏఈ అయినా మీదికెళ్లి ఎంత వస్తే అంత రైతులకు ఇస్తరు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. గతంలో ఓ గ్రామపంచాయతీకి వెళ్లి ట్రాక్టర్ ఎందుకు మూలన పడిందని పంచాయతీ సెక్రటరీని ప్రశ్నించాం. డీజిల్ లేక మూలకు పడిందంటే.. ఆ పంచాయతీ సెక్రటరీని రేవంత్ సర్కార్ సస్పెండ్ చేసింది. నువ్వు మీదికెళ్లి పైసలు ఇచ్చినకా డీజిల్ పోయరా.. నడపరా.. మీదికెళ్లి బంద్ పెట్టడం ఆపేయాలి. చిన్న చిన్న అధికారుల మీద చర్యలు తీసుకోకుండా.. నిజాయితీగా రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు.