Cold Waves | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా చల్లని గాలులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. బుధవారం రాత్రితో పాటు గురువారం ఉదయం వరకు ఎముకలు కొరికే చలి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ చల్లని గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు హైదరాబాద్ నగరంలో 8.4 డిగ్రీల సెల్సియస్ నుంచి 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పటాన్చెరులో అత్యల్పంగా 8 డిగ్రీల సెల్సియస్, రాజేంద్రనగర్, హయత్నగర్లో 9, 11 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. బేగంపేటలో 13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజ్గిరి, భువనగిరి, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో రాబోయే 48 గంటల్లో 11 డిగ్రీల నుంచి 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.