Cold Wave | హైదరాబాద్ : ఈ నెల 24వ తేదీ వరకు చలి గాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వృద్ధులు, పిల్లలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు చల్లని గాలులకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. సాధారణం కంటే తక్కువగా 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు పేర్కొన్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితమైనట్లు తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 8.3 డిగ్రీల సెల్సియస్, రాజేంద్రనగర్‌లో 9, మౌలాలిలో 9.1, అల్వాల్‌లో 10.3, గచ్చిబౌలిలో 10.4, కుత్బుల్లాపూర్‌లో 10.8, గాజులరామారంలో 10.8, తిరుమలగిరి, వెస్ట్ మారేడ్‌పల్లిలో 11.3 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక సంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, వికారాబాద్ జిల్లాలో 7, ఆసిఫాబాద్‌లో 7.2, ఆదిలాబాద్‌లో 7.6, మెదక్‌లో 7.9, కామారెడ్డిలో 7.9, రంగారెడ్డిలో 8.1, నిజామాబాద్ జిల్లాలో 8.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.