Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గ్రామపంచాయతీలకు న్యూఇయర్ కానుక ప్రకటించారు. కొత్తగా కొలువుదీరిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు కొండగల్ వేదికగా శుభవార్త వినిపించారు. మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షలు, చిన్న గ్రామపంచాయతీలకు రూ. 5 లక్షల నిధులు సీఎం ఫండ్ నుంచి మంజూరు చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. 2009లో తనను ఆశీర్వదించి శాసనసభకు పంపారు. ఈనాడు రాష్ట్రానికి సీఎం అయి.. నాయకత్వం వహిస్తున్నానంటే మీరు నిండు మనసుతో ఆశీర్వదించారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని మహిళా సర్పంచ్లు అడిగారు. కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ప్రతి గ్రామం, తండాకు రోడ్లు పూర్తి చేయడమే కాకుండా గుడి, బడి, తాగే నీరు, సన్నబియ్యం అందుబాటులోకి తెచ్చి.. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. విద్యావకాశాలు మెరుగుపరుస్తాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పారిశ్రామిక వాడను మన ప్రాంతంలో అభివృద్ధి చేసుకుందాం. చదువుకున్న వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకుందాం. దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందాం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక రాజకీయాల్లేవు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పార్టీలు పంథాలు.. ఫలితాలు వచ్చాయి.. పంథాలకు పోకుండా ప్రతి పౌరుడు మన కుటుంబ సభ్యుడిలాగా భావించాలి. వివక్ష చూపించకుండా అందర్నీ కలుపుకుని పోదాం. ఎలాంటి వివక్ష చూపించకండి.. వివక్ష చూపిస్తే ఆ గ్రామానికి అన్యాయం జరుగుతుంది. ఏ గ్రామంలో, తండాలో సమస్య వివక్ష ఉండకూడదు. నిన్నటి వరకు బేధాలు, మనస్ఫర్థలు ఉంటే పక్కన పెట్టండి. ఇప్పుడు పెద్ద మనసుతో వ్యవహరించాలి. చిన్న చిన్న విషయాలకే గ్రామాల్లో కక్షలు పెంచుకోవద్దు.. గ్రామాల అభివృద్ధికి పాటుపడండి అని సర్పంచ్లకు రేవంత్ రెడ్డి సూచించారు. పదేండ్లుగా గెలిచినా ఓడినా మీ మధ్యలో ఉండి తిరిగాను. 2009 నుంచి 2023 వరకు ఎక్కడ గెలవడానికి అవకాశం ఉన్నా.. మళ్లీ ఇక్కడే వచ్చి గెలిచాను. అందుకే కొండగల్ నియోజకవర్గం నా ప్రాణం. 2018లో కుట్ర జరిగి ఓటమి చెందాను. మల్కాజ్గిరిలో నిలబడితే వందలాది మంది కార్యకర్తలు ప్రచారం చేసి గెలిపించారు. ఇంత కంటే పెద్ద పదవి వచ్చేది లేదు.. ఇంత గొప్ప అవకాశం వచ్చింది ఈనాడు అని రేవంత్ రెడ్డి తెలిపారు. చాలా మంది మహిళా సర్పంచ్లు ప్రజా జీవితంలో వచ్చారు. మీ గ్రామానికి ఏం కావాలో ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. 12706 గ్రామాల సర్పంచ్లందరికి సూచన. ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్.. పెద్ద గ్రామాలకు 10 లక్షలు, చిన్న గ్రామాలకు 5 లక్షలు నిధులు సీఎం నిధి నుంచి మంజూరు చేస్తా.. వీటిని నూతన సంవత్సరంలో ఇచ్చే బాధ్యత నాది. కేంద్రం, రాష్ట్రం నుంచి వచ్చే నిధులకు ఇవి అదనం. సర్పంచ్ల గౌరవం నిలబెట్టడానికి ఈ నిధులు ఇస్తున్నా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సంబంధం లేకుండా సీఎం ఫండ్ నుంచి సర్పంచ్లకు నిధులు పంపించే బాధ్యత నేను తీసుకుంటున్నా. ప్రణాళికలు సిద్ధం చేసుకోండి.. మాటను నిలబెట్టుకోండి. సమస్యలను పరిష్కరించేందుకు ఈ నిధులను ఉపయోగించుకోండి అని సర్పంచ్లకు రేవంత్ రెడ్డి సూచించారు.