BRS Party | హైదరాబాద్ : బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశం రెండున్నర గంటలకు పైగా కొనసాగింది. నీటి ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కేసీఆర్ గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మరి ముఖ్యంగా ఏపీ జల దోపిడీ, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్ర రైతాంగానికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాబోయే 15 రోజుల్లో మూడు బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఈ సభలను నిర్వహించి, రైతులను అప్రమత్తం చేయాలని గులాబీ బాస్ పార్టీ శ్రేణులకు సూచించినట్లు సమాచారం. ఈ బహిరంగ సభలకు ముందు నియోజకవర్గ, మండల స్థాయిలో రైతులతో సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. జలదోపిడీతో పాటు సాగునీటి ప్రాజెక్టులపై ప్రస్తుత సర్కార్ చూపిస్తున్న నిర్లక్ష్యంపై రైతులకు సవివరంగా వివరించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు కేసీఆర్.