Maoists | హైదరాబాద్ : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ముగ్గురు రాష్ట్ర నాయకులతో పాటు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టులు లొంగిపోయినట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో హిడ్మా బెటాలియన్ కమాండర్స్ ఉన్నట్లు తెలిపారు. కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎర్రగుళ్ల రవి అలియాస్ సంతోష్, మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యులు, ఇద్దరు సెంట్రల్ విజన్ కమాండర్లు ఉన్నారు. మిగతా మావోయిస్టులంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారిగా డీజీపీ తెలిపారు. మావోయిస్టుల నుంచి 24 తుపాకులతో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల అంతం తప్పదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత చేపట్టారు. ఇప్పటికే అనేక మంది మావోయిస్టులు భద్రతాబలగాల కాల్పుల్లో మరణించారు. వారిలో మావోయిస్టు కీలక నేతలు కూడా ఉన్నారు. మావోయిస్టు కీలక నేత హిడ్మాతో పాటు చలపతి, బాలకృష్ణ, గణేష్, కట్టా రామచంద్రారెడ్డి, బస్వరాజ్ ఇలా అనేక మంది ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు.