Mancherial | తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నేటితో ముగిసింది. మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఇవాళ చివరి విడత ఎన్నికల్లో భాగంగా.. 3,752 గ్రామ పంచాయతీలు, 28,410 వార్డులకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. మరికాసేపట్లో పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ తుది విడత ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలో శతాధిక వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకుంది. 115 ఏళ్ల శతాధిక వృద్ధురాలు.. తన ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి వీల్ చైర్లో చేరుకుంది. అనంతరం తన ఓటు హక్కును వినియోగించుకుని.. మళ్లీ ఇంటికి చేరుకుంది. అయితే ఓటేసేందుకు వచ్చిన శతాధికురాలిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వృద్ధురాలిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పోలింగ్ అధికారులు, పలువురు నాయకులు సూచించారు. తుది విడతలో భాగంగా సర్పంచి పదవి కోసం 12,652 మంది, వార్డు మెంబర్లుగా 75,725 మంది బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల్లో 8,566 గ్రామాల్లో ఎన్నికలు పూర్తికాగా, మూడో విడతలో 182 మండలాల్లోని 4,159 పంచాయతీలు, 36,452 వార్డుల్లో అభ్యర్థులు బరిలో నిలిచారు. 11 పంచాయతీలు, 116 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 2 పంచాయతీలు, 18 వార్డుల్లో కోర్టు స్టే వల్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మిగతా వాటిలో 394 మంది సర్పంచ్‌లుగా, 7,908 మంది వార్డు మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.