Hanuman Chalisa Recitation | డిసెంబర్ 25 అంటే అందరికీ తెలుసు. దేశమే కాదు ప్రపంచమంతా క్రిస్మస్ని ఎంతో ఘనంగా జరుపుకుంటుంది. ముఖ్యంగా చర్చిలను అందంగా అలంకరించి అక్కడ క్రిస్టియన్లు ప్రార్థనలు చేస్తుంటారు. ఎక్కడ చూసినా క్రిస్మస్కి సంబంధించిన హడావుడే ఉంటుంది. కానీ.. హర్యానాలోని హిసార్‌లో మాత్రం బజ్రంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, హిందూ రైట్ వింగ్ ఆర్గనైజన్ అన్నీ కలిసి సంయుక్తంగా హనుమాన్ చాలిసా పఠనానికి అందరికీ ఆహ్వానం పంపాయి. అందరూ కలిసి బృందంగా హనుమాన్ చాలిసా పఠించాలని, సిటీలోని పార్క్‌లో ఈ పఠనం ఉంటుందని, అది కూడా డిసెంబర్ 25నే ఉంటుందని ప్రకటించాయి. అది కూడా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్న చర్చి పక్కనే కావడంతో ఈ ప్రకటన సర్వత్రా చర్చనీయాంశం అయింది. డిసెంబర్ 25నే హనుమాన్ చాలిసా పఠనం ఎందుకు? చాలామంది దీన్ని ఏదో మతాల మధ్య గొడవ పెట్టేలా చేస్తున్న చర్యలా ఉందని అనుకుంటారు కానీ.. డిసెంబర్ 25నే ఈ సంఘాలు అన్నీ కలిసి హనుమాన్ చాలిసా పఠనం ఏర్పాటు చేయడానికి గల కారణం తెలిస్తే మాత్రం ఈ సంఘాలు చేసేది కరెక్ట్ అని అంటారు. వాళ్లకే మద్దతు తెలుపుతారు. భరత్పూర్ అనే రాజ్యం ఒకప్పుడు ఉండేది. అది ప్రస్తుత హర్యానా రాష్ట్రంలో ఉండేది. ఆ భరత్‌పూర్‌ను పాలించిన రాజు మహారాజ సూరజ్మాల్ తన జీవితమంతా ప్రజల కోసమే పోరాడారు. జాతీయ సమైక్యత కోసం కృషి చేశారు. సమాజంలో ఉన్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడారు. మూఢనమ్మకాలు, జాతి వివక్షకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు. అలా తన జీవితాన్ని సమాజం కోసమే డిసెంబర్ 25, 1763 న త్యాగం చేశారు.. అని సురజ్మాల్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ చెబుతోంది. అందుకే ఆయన త్యాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న మహారాజ సురజ్మాల్ బలిదాన్ దివాస్‌ను జరుపుకుంటారు. అందులో భాగంగానే హనుమాన్ చాలిసా పఠనం ఉంటుంది. చర్చి పక్కనే ఉన్న పార్క్‌లో ఈ పఠనం ఉండటంతో ఎలాంటి మత కలహాలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గత కొన్నేళ్లుగా హిందూ కమ్యూనిటీ దీన్ని ఫెస్టివల్‌గా నిర్వహిస్తోంది. ఈ పార్క్ సిటీకి మధ్యలో ఉండటం వల్లనే ఈ పార్క్‌ని ఎంచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈసారి పెద్ద సంఖ్యలో హిందూ ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నట్లు తెలిపారు. అందులోనూ చాలామంది ప్రజలే డిసెంబర్ 25న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని హిందూ సంఘాలను కోరినట్లు నిర్వాహకులు పోలీసులకు తెలపడంతో పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసి హిందూ సంఘాలకు సహకరించేందుకు సమ్మతించారు. అలా డిసెంబర్ 25న.. చర్చి పక్కనే హిందూ సమాజం ఒకేచోట హాజరై హనుమాన్ చాలిసాని పఠించడం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.