ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఓ పైలట్ ప్రయాణికుడిపై దాడి చేశాడు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎయిర్ లైన్స్‌కి చెందిన పైలట్, ఓ ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించి, దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన ఎయిర్ పోర్టులలో ప్రయాణికుల భద్రతపై మరోసారి ప్రశ్న లేవనెత్తేలా చేసింది. అసలేం జరిగింది? అసలేం జరిగిందంటే.. అంకిత్ దివాన్ అనే ప్రయాణికుడు తన ఫ్యామిలీతో కలిసి విమాన ప్రయాణం కోసం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాడు. నాలుగు నెలల తమ పాపను కూడా తీసుకొని వాళ్లు ఎయిర్‌పోర్ట్‌కి వచ్చారు. సెక్యూరిటీ చెక్ చేస్తూ సిబ్బంది వాళ్లను స్టాఫ్, పీఆర్ఎం ఎంట్రీ ద్వారా వెళ్లాలని సూచించారు. దీంతో వాళ్లు స్టాఫ్ ఎంట్రీ ద్వారా వెళ్తుండగా కొందరు సిబ్బంది క్యూ పాటించకుండా ముందుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అంకిత్ వాళ్లను ప్రశ్నించాడు. అదే క్యూలో వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ కెప్టెన్ వీరేందర్ జోక్యం చేసుకొని.. నీకు చదువు రాదా? ఇది స్టాఫ్ కోసం అని బోర్డు కనిపించడం లేదా? అంటూ దురుసుగా ప్రవర్తించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రేకుడైన పైలట్ వీరేందర్.. అంకిత్‌పై దాడి చేశాడు. అతడి ముఖంపై చేతితో కొట్టాడు. దీంతో అంకిత్ ముక్కు నుంచి రక్తం కారింది. దీంతో ఏం చేయలేని స్థితిలో ఉన్న అంకిత్ తనకు జరిగిన అన్యాయాన్ని, తనపై జరిగిన దాడిని సోషల్ మీడియాలో ఫోటోలతో సహా షేర్ చేశాడు. స్పందించిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఆ సమయంలో ఆ పైలట్ విధుల్లో లేడని, వేరే విమానంలో ప్రయాణికుడిగా వెళ్తున్నాడని తెలిపింది. అయినా కూడా ప్రయాణికుడి పట్ల ఇలాంటి ప్రవర్తనను తాము సహించమని, పైలట్‌ను వెంటనే విధుల్లో నుంచి తొలగించామని తెలిపింది. పూర్తిస్థాయి విచారణ పూర్తయ్యాక.. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎయిర్ లైన్స్ హామీ ఇచ్చింది.