గత రెండు మూడు రోజులుగా ఇండిగో విమాన సర్వీసులు ఆలస్యం అవడం, కొన్ని రద్దు అవడం వల్ల విమాన ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఎయిర్ లైన్స్ లో వచ్చిన కొత్త రూల్స్ వల్ల సిబ్బంది కొరత ఏర్పడి ఇండిగో విమానాలు ఆలస్యం అవడం, సడెన్ గా రద్దు అవడం జరుగుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ ఇండిగో సర్వీసుల సమస్య తీరలేదు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన డొమెస్టిక్ విమానాలన్నీ శుక్రవారం రాత్రి వరకు రద్దు చేస్తున్నట్టు ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటన విడుదల చేసింది. దాదాపుగా 250 విమానాలు రద్దు అయినట్లు తెలుస్తోంది. ఇండిగో తప్ప మిగితా సంస్థల విమాన సర్వీసులన్నీ యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే నడుస్తున్నట్టు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ స్పష్టం చేసింది. ప్రయాణికులకు కలుగుతున్న ఈ ఇబ్బంది, అంతరాయాన్ని తగ్గించడం కోసమే, ప్రయాణ అనుభవాన్ని మెరుగు పరచడం కోసమే తమ గ్రౌండ్ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని.. ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్ ను ముందుగా చెక్ చేసుకున్న తర్వాతే ఎయిర్పోర్ట్కు రావాలని ఇండిగో సంస్థ సూచించింది.