Maoists | రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ తుపాకులు గర్జించాయి. తూటాల వర్షం కురిసింది. సుక్మా జిల్లాలోని గొల్లపల్లి ఫారెస్టు ఏరియాలో ముగ్గురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. గొల్లపల్లి ఫారెస్టు ఏరియాలో మావోయిస్టులు తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు బృందాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. డీఆర్జీ బలగాలు మావోయిస్టులపైకి కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ముగ్గురు మావోయిస్టులు పోలీసుల తూటాలకు బలయ్యారు. ఎదురుకాల్పులు ముగిసిన అనంతరం ముగ్గురు మావోయిస్టుల డెడ్‌బాడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలిలో భారీ స్థాయిలో ఆయుధాలు, మందు గుండు సామాగ్రి, విప్లవ సాహిత్యంతో పాటు పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక గొల్లపల్లి ఫారెస్టు ఏరియాను పోలీసులు జల్లెడ పడుతున్నారు.