Couple Divorce | ఓ జంట రెండేళ్ల పాటు సహజీవనం చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న 24 గంటల్లో ఆ నవ వధూవరులు విడాకులు కూడా తీసేసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. పెళ్లి కాగానే వాళ్ల మధ్య మనస్పర్థలు రావడంతో వెంటనే విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకొని లాయర్ని సంప్రదించారు. ఇది ఒక అసాధారణమైన కేసు అని ఆ జంట విడాకుల కేసును వాదించిన లాయర్ చెప్పుకొచ్చారు. భర్త ఇంజినీర్, భార్య డాక్టర్. పెళ్లి కాగానే వాళ్ల జీవన విధానంపై ఒక క్లారిటీకి రాలేకపోయారు. ఇద్దరి మధ్య సైద్ధాంతిక విభేదాలు వచ్చాయని, అందుకే కాలయాపన చేయకుండా వెంటనే విడాకులు తీసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు అడ్వకేట్ రాణి సోనావానె తెలిపారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య ఎలాంటి హింస చోటు చేసుకోలేదు. ఎలాంటి నేరానికి పాల్పడలేదు. ఇద్దరూ సంయమనం పాటించారు. ఇద్దరిదీ ప్రేమ వివాహం అయినా వాళ్ల విడాకుల ప్రక్రియను చట్టప్రకారంగా తీసుకెళ్లాలని అనుకున్నారు. అందుకే ఇద్దరూ విడాకుల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారని అడ్వకేట్ అన్నారు. షిప్లో పని చేసేందుకు వెళ్తున్నందుకేనా? పెళ్లి కాగానే.. తాను ఓ షిప్లో పని చేసేందుకు వెళ్తున్నానని, ఎన్ని రోజులు వదిలి వెళ్లాలో, తిరిగి ఎప్పుడు వస్తానో కూడా తన భర్త చెప్పకపోవడం వల్లనే భార్యకు తన భర్త తనను వదిలి వెళ్లడం ఇష్టం లేక విడాకులు తీసుకుందామని చెప్పడంతో ఇద్దరూ దానికి అంగీకరించారని అడ్వకేట్ రాణి అన్నారు. పెళ్లి అయిన వెంటనే ఒకరిని విడిచి మరొకరు ఉండటం కరెక్ట్ కాదని, ఇలాంటి పరిస్థితుల్లో విడాకులే బెస్ట్ ఆప్షన్ అని ఆ జంట భావించిందట. కోర్టు కూడా ఈ కేసుపై వెంటనే రెస్పాండ్ అయి విడాకులు ఇచ్చింది. ఇలాంటి కేసులలో సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం వాళ్లకు వెంటనే విడాకులు మంజూరు చేసింది.