Video | ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో విషాద ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హనుక్కా వేడుకల సమయంలో ఇద్దరు సాయుధులైన దుండగులు ప్రజలపై రెచ్చిపోయారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 12 మంది మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘోర విషాదం నడుమ ఓ సామాన్యుడు చూపించిన తెగువకు ప్రపంచం ఫిదా అయింది. తన చేతిలో ఎలాంటి ఆయుధం లేకపోయినా, గన్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న దుండగుడి మీదికి దూకి అతడిని గట్టిగా పట్టుకొని అతడి వద్ద ఉన్న గన్ను లాక్కున్నాడు. ఆ తర్వాత ఆ దుండగుడికి గన్ ఎక్కు పెట్టడంతో ఆ దుండగులు భయపడి సరెండర్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరోగా మారిన అహ్మద్ ఆ దుండగుడిని పట్టుకున్న వ్యక్తి పేరు అహ్మద్ అల్. తన ప్రాణాలను పణంగా పెట్టి చూపించిన తెగువ వల్లనే చాలామంది ప్రాణాలు దక్కాయని పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు కూడా అతడి ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ప్రధాని ప్రశంసలు ఈ దుర్ఘటనలో సామాన్య పౌరుడు చూపించిన తెగువ అసాధారణమైందని ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కొనియాడారు. తోటి వారి ప్రాణాలు కాపాడేందుకు ఆస్ట్రేలియన్లు ఎంతటి సాహసానికైనా తెగిస్తారని ఈ ఘటన నిరూపిస్తోంది.. అని ప్రధాని ప్రశంసించారు. యూదులు జరుపుకుంటున్న ఈ పండుగను లక్ష్యంగా చేసుకున్న దుండగులు వేడుకలు చేసుకుంటున్న వారిపై దాడికి తెగబడ్డారు. ఇది ఉగ్రదాడే అని పోలీసులు ప్రకటించారు. ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న దుండగుల్లో ఒకరు పోలీసుల కాల్పుల్లో మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుండగుల్లో ఒకడు పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. అతడి ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. BREAKING: Video shows how bystander disarmed one of the Bondi Beach gunmen pic.twitter.com/YN9lM1Tzls — The Spectator Index (@spectatorindex) December 14, 2025