HYDRAA | హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం చేశారు. హయత్‌నగర్‌లోని తన ఇంట్లో గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు కృష్ణ చైతన్య. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చైతన్యను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. బాధిత గన్‌మెన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్‌కి కృష్ణ చైతన్య బానిసై భారీగా నష్టపోయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే భారీగా అప్పులు, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గన్‌మెన్ ఆత్మహత్యాయత్నాన్ని సంచలనం చేయొద్దు : రంగనాథ్ గన్‌మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఆర్థిక సమస్యల వల్లే చైతన్య ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయాన్ని సంచలనం చేయవద్దు. ఈరోజు ఉదయం ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో కానిస్టేబుల్ చైతన్యను కలిశాను. అతని పరిస్థితి విషమంగా ఉంది, బ్రతికే అవకాశం చాలా తక్కువగా ఉందని తెలిసింది. దాదాపు 2 సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్‌లు, గేమింగ్ యాప్‌లలో పాల్గొనడం వల్ల అతను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. దాదాపు 3 నెలల క్రితం కుటుంబ సమస్యలతో గొడవల వల్ల కృష్ణ చైతన్య ఇంటి నుండి వెళ్లిపోయాడు. అప్పటి నుండి కృష్ణ చైతన్య నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.