Electric Flying Taxi | ఎయిర్ టాక్సీ.. అనే పదం చాలా ఏళ్లుగా వింటున్నాం కానీ.. మన భారత్‌లో ఇంకా అది సుసాధ్యం కాలేదు. కానీ.. కొన్ని రోజుల్లోనే మనకు ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి రానున్నాయా? అంటే అవుననే అంటోంది బెంగళూరుకు చెందిన సరళా ఏవియేషన్ సంస్థ. ఈ కంపెనీ ఎయిర్ టాక్సీని రూపొందించింది. ప్రస్తుతం అది టెస్టింగ్ దశలో ఉంది. ఇప్పటికే వాళ్లు తయారు చేసిన ఎయిర్ టాక్సీ గ్రౌండ్ టెస్టింగ్ పూర్తి కాగా, వాలిడేషన్ కోసం వేచి చూస్తోంది. ఇది ఎలక్ట్రిక్ టాక్సీ. అంటే పవర్‌తో నడుస్తుంది. దీని పేరు SYLLA SYL-XI. దీన్ని eVTOL విమానం అంటారు. అంటే ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ విమానం అన్నమాట. 2028 సంవత్సరం లోపు పూర్తి స్థాయిలో ఎయిర్ టాక్సీలు భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఈ కంపెనీ రూ.116 కోట్ల నిధులను సేకరించి ఈ ఎయిర్ టాక్సీని డెవలప్ చేసింది. కేవలం 9 నెలల్లోనే ఈ టాక్సీని సంస్థ రూపొందించింది. మేక్ ఇన్ ఇండియా నినాదంతో సరళా ఏవియేషన్ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ని తయారు చేసింది. Electric Flying Taxi | ఆరుగురు వ్యక్తులు ప్రయాణించేలా ఏర్పాట్లు ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలో ఆరు సీట్లను ఏర్పాటు చేశారు. అంటే ఆరుగురు ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించవచ్చు. ఈ టాక్సీకి గ్రీన్ సిగ్నల్ వస్తే 2028 లోపు బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పూణె లాంటి నగరాల్లో ఈ టాక్సీలు గాల్లో ఎగురనున్నాయి.