DK Shivakumar | కర్ణాటక రాజకీయాల్లో మరో కొత్త చర్చ స్టార్ట్ అయింది. ఇప్పటికే నాయకత్వ మార్పులపై కర్ణాటక కాంగ్రెస్‌లో చర్చలు జరుగుతున్న వేళ.. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం శివకుమార్ నివాసంలో జరిగిన ఓ ఆసక్తికర పరిణామం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆ ఆసక్తికర ఘటనకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. ఇంతకీ ఏం జరిగింది? హరిద్వార్ నుంచి సుమారు 20 మంది నాగ సాధువులు.. బెంగళూరులోని డీకే శివకుమార్ ఇంటికి వచ్చారు. ఆయన నివాసానికి వచ్చి ప్రత్యేక ఆశీర్వాదాలు ఇచ్చారు. ఇప్పటికే కాశీ నుంచి వచ్చిన నాగ సాధువులు శివకుమార్‌ని ఆశీర్వదించి వెళ్లారు. ఆయన సీఎం కావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు హరిద్వార్ నుంచి వచ్చిన నాగ సాధువులు కూడా ఆయన్ను సీఎం కావాలని ఆశీర్వదించడంతో శివకుమార్ వర్గాల్లో ఉత్సాహం నెలకొన్నది. DK Shivakumar |డీకే ఏమన్నారు? ఇది కావాలని చేసింది కాదు. అనుకోకుండా జరిగింది. మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్లను ఎందుకు వచ్చారు అని అడగలేం కదా. వాళ్లు భక్తి భావంతో, ఆధ్యాత్మిక స్ఫూర్తితో వచ్చి నన్ను ఆశీర్వదించారు. వాళ్ల నుంచి ఆశీస్సులు తీసుకున్నాను.. అని శివకుమార్ సీఎం పదవి విషయాన్ని దాటవేశారు. అసలు ఎవరీ నాగ సాధువులు నాగ సాదువులనే సన్యాసులు అని కూడా పిలుస్తారు. వీళ్లు హిందూ ధర్మంలోనే అత్యంత కఠినమైన నియమాలు పాటించేవాళ్లు. వీళ్లు ఎక్కువగా బయట కనిపించరు. ఎప్పుడూ కఠోర దీక్ష చేస్తూ ఉంటారు. కుంభమేళ లాంటి ప్రత్యేక సమయంలో మాత్రమే వాళ్లు బయటికి వస్తారు. కఠినమైన నియమాలు పాటించి, శిక్షణ తీసుకున్న తర్వాత వీళ్లు నాగ సాధువులుగా మారుతారు. మరి.. ఇలాంటి నాగ సాధువులు వచ్చి శివకుమార్‌ను ఆశీర్వదించడం, మరోవైపు కర్ణాటకలో ప్రభుత్వంలో సగం కాలం ముగియడంతో, అధికార మార్పిడి జరుగుతుందా? సీఎం పదవి శివకుమార్‌ను వరిస్తుందా? అనేది కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.