Lionel Messi | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతోంది. ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజం లియోనల్ మెస్సీ భాగస్వామ్యంతో కూడిన ఫ్రెండ్లీ మ్యాచ్ డిసెంబర్ 13వ తేదీన నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో లియోనల్ మెస్సీ ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాట్లను రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి పరిశీలించారు. ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాట్లను అధికారులు మంత్రులకు వివరించారు. స్టేడియమంతా మంత్రులు కలియతిరిగి ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేశం నలుమూలల నుంచి వచ్చే అభిమానుల కోసం భద్రత, లాజిస్టిక్, పార్కింగ్ తదితర ఏర్పాట్లు పకడ్బందీగా సాగుతున్నాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మెస్సి మ్యాచ్ హైదరాబాద్ ప్రతిష్టను మరింతగా పెంచుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఒక జట్టుకు స్వయంగా సారథ్యం వహించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ కూడా చేశారు. దీంతో ఈ మ్యాచ్‌పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫుట్ బాల్ అభిమానులు సహా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం ఈ అద్భుతమైన ఫ్రెండ్లీ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ వివరాల విషయానికి వస్తే.. లియోనల్ మెస్సీ డిసెంబర్ 12వ తేదీన రాత్రి బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చేరుకోనున్నారు. 13న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో 200 మంది సిబ్బంది బృందంతో కలిసి హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈవెంట్లో భాగంగా వివిధ రంగాల ప్రముఖులతో కలిసి ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇందులో రెండు జట్లు తలపడనున్నాయి. ఒక జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి, మరో జట్టుకు సాక్షాత్తూ మెస్సీ సారథ్యం వహించనున్నారు. ఫ్రెండ్లీ మ్యాచ్ ముగిసిన అనంతరం యువ ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మెస్సీ మాస్టర్ క్లాస్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. చివరగా ప్రేక్షకులను అలరించేందుకు మ్యూజికల్ కాన్సర్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.