రోజులో ఎన్ని గంటలు అని చిన్నపిల్లాడిని అడిగినా టక్కున 24 గంటలు అని చెబుతాడు. మన దగ్గరే కాదు ప్రపంచమంతా ఎక్కడైనా ఒక రోజులో 24 గంటలు మాత్రమే ఉంటాయి. కానీ భవిష్యత్తులో ఆ 24 గంటలు కాస్త 25 గంటలు కాబోతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు మాత్రం 24 గంటలుగా ఉంది కానీ.. రాబోయే రోజుల్లో 24 గంటలు ఉండకపోవచ్చు.. ఒక రోజులో 24 గంటలు పోయి 25 గంటలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దానికి కారణాలు కూడా చెప్పుకొచ్చారు. ఇదంతా చదవడానికి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉంటుంది కానీ.. దీని వెనుక ఉన్న కారణాలు తెలుసుకుంటే నిజమే అని మీరు కూడా ఒప్పుకుంటారు. తగ్గుతున్న భూమి వేగం భూమి తన చుట్టు తాను తిరిగే వేగం (Earth Rotation) క్రమం తగ్గతుండటం వల్లనే రోజులో మరో గంట పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు భూమి వేగం ఎందుకు తగ్గుతోంది? అంటే దాని వెనుక కూడా పలు కారణాలు ఉన్నాయి. ప్రధానంగా నాలుగు కారణాలను ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడి ప్రభావం చంద్రుడికి ఉండే గురుత్వాకర్షణ శక్తి వల్ల సముద్రాలాను అది ఆకర్షిస్తోంది. దాని వల్ల సముద్రాల్లో అలల ఘర్షణ ((Tidal Friction)) ఎక్కువై భూమి వేగం తగ్గుతోంది. భూమి అంతర్భాగంలో కదలికలు భూమి లోపల ఉండే ద్రవ రూపంలో ఉన్న ఇనుము, ఇతర పదార్థాల కదలికల వల్ల భూమి ద్రవ్యరాశి పున:పంపిణీ అయి భూమి తిరిగే వేగంలో మార్పు వస్తోంది. కరుగుతున్న గ్లేసియర్లు పెద్ద పెద్ద మంచు కొండలు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల కరిగిపోతున్నాయి. మన దగ్గర ఉన్న హిమాలయన్ రేంజ్లోని గ్లేసియర్స్ కరిగి ఎలా గంగా నదిలో కలుస్తున్నాయో.. ప్రపంచవ్యాప్తంగా ఆర్కిటిక్, అంటార్కిటికా ప్రాంతాల్లోని గ్లేసియర్స్ కూడా కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. దాని వల్ల భూమి భ్రమణ వేగం తగ్గుతోంది. వాతావరణం, గాలులు వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించలేకపోతున్నాం. భీకర గాలులు, వాతావరణ మార్పులు కూడా భూమి వేగాన్ని తగ్గిస్తున్నాయి. 25 గంటలుగా ఎప్పుడు మారనుంది? త్వరలోనే 24 గంటలు కాస్త పోయి రోజుకి 25 గంటలు వస్తాయా? రోజులో ఒక గంట పెరిగిందంటే మనకు బెటరే కదా అని తొందరపడకండి. ఎందుకంటే.. ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. రోజుకు 25 గంటలు కావాలంటే ఇంకో 200 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. అంటే మరో 20 కోట్ల సంవత్సరాలు అన్నమాట. ప్రతి వందేళ్లకు భూమి భ్రమణ వేగం కేవలం 1.7 మిల్లీ సెకన్లు మాత్రమే తగ్గుతోందట. దాని ప్రకారం లెక్కేస్తే 20 కోట్ల సంవత్సరాల తర్వాత 24 గంటలు కాస్త 25 గంటలు కానున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి మన గడియారాలకు వచ్చే ముప్పేం లేదు. డైనోసర్ల టైమ్లో రోజుకి 23 గంటలే మీకు ఈ విషయం తెలుసా? మన కంటే ముందు ఈ భూమి మీద డైనోసర్లు ఉండేవి. కొన్ని కోట్ల సంవత్సరాల కింద డైనోసర్లు ఈ భూమి మీద ఉన్నప్పుడు రోజుకి 23 గంటలే ఉండేవట. అంటే ఇప్పుడు ఉన్న సమయం కంటే గంట తక్కువ. కాలక్రమేణా భూమి వేగం తగ్గడం వల్లనే ఇప్పుడు మనం 24 గంటలకు చేరుకున్నాం. భవిష్యత్తులో మరికొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత భూమి వేగం మరింత తగ్గి 25 గంటలకు చేరుకుంటాం అన్నమాట. మనపై ప్రభావం ఎంత? సడెన్గా రోజులో ఉన్న 24 గంటలు కాస్త 25 గంటలు అయితే ఒక గంట కలిసి వస్తుందిలే అని అనుకోవద్దు. రోజుకి 25 గంటలు అయితే మన జీవ వ్యవస్థ దెబ్బతింటుంది. అస్తవ్యస్తం అవుతుంది. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి 24 గంటల రోజుకి అలవాటు పడ్డాం. నిద్ర కావచ్చు, హార్మోన్ల విడుదల, శరీరంలో అవయవాల పనితీరు అన్నీ 24 గంటలకు అలవాటు పడటంతో ఒక్కసారిగా రోజుకి 25 గంటలు వస్తే.. గుండె సమస్యలు, మానసిక ఒత్తిడి పెరగడం, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయట. కాకపోతే ఒకేసారి 24 గంటల నుంచి 25 గంటలకు పెరగదు కాబట్టి, కోట్ల సంవత్సరాల ప్రక్రియ కాబట్టి జీవరాశులు కూడా ఆ మార్పుకు అనుగుణంగా పరిణామం చెందుతాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.