Unnao Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ మైనర్ బాలిక అత్యాచార కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కి సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇటీవల సెంగార్ జీవిత ఖైదును సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అతడికి ఇచ్చిన బెయిల్‌పై తాజాగా సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించగా.. సెంగార్ బెయిల్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో జైలు నుంచి బయటికి రావాలని అనుకున్న కుల్దీప్ సెంగార్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. సీబీఐ సవాల్ చేసిన పిటిషన్‌పై సుప్రీం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీద్‌లో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. బాధితురాలి రక్షణపై కోర్టుకు బాధ్యత ఉండాలని.. దీనిపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని సుప్రీం.. సెంగార్‌కి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించిన కేసుపై కూడా శిక్ష అనుభవిస్తున్నందున అతడు జైలులోనే ఉండాలని, బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని సుప్రీం తేల్చిచెప్పింది. బాధితురాలి వాంగ్మూలం కూడా వినేందుకు కోర్టు అనుమతించింది. బాధితురాలు హర్షం సుప్రీం తీర్పుపై ఉన్నావ్ బాధితురాలు హర్షం వ్యక్తం చేసింది. అధికారులకు లంచం ఆశ చూపి నిందితుడు బయటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని, అతడికి బెయిల్ వస్తే తమ కుటుంబానికి ముప్పు ఉందని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనకు భద్రత కల్పించాలని ఆమె కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కుల్దీప్ సెంగార్ మరికొంత కాలం జైలులోనే గడపాల్సి ఉంటుంది. ఈ కేసు తదుపరి విచారణ జనవరి చివరి వారంలో జరగనుంది.