రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గురువారం సాయంత్రమే ఆయన ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఢిల్లీలో ఆయన విడిది చేసేది ఎక్కడో కాదు.. హైదరాబాద్ నిజాం నిర్మించిన హైదరాబాద్ హౌస్ లో. అందులోనే పుతిన్‌కు భారత ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తోంది. హైదరాబాద్ చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1920 లో ఈ రాజభవనాన్ని ఢిల్లీలో నిర్మించారు. ఆ సమయంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఢిల్లీకి వెళ్లినప్పుడు అక్కడ బస చేయడం కోసం ఆ భవనాన్ని అలీ ఖాన్ ఇష్టంగా కట్టించుకున్నారు. అత్యంత విలాసవంతమైన ఈ బంగ్లా విలువ ప్రస్తుతం రూ.170 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఢిల్లీలో ఉన్న అత్యంత ఖరీదైన రాజభవనాల్లో ఇది ఒకటిగా ఉంది. ఈ భవనాన్ని సీతాకోకచిలుక ఆకారంలో నిర్మించారు. ఆకాశం నుంచి చూస్తేనే బటర్ ఫ్లై ఆకారం కనిపిస్తుంది. మొత్తం 36 గదులు ఉన్న ఈ రాజభవనంలో విశాలమైన హాల్స్, తోటలు, ఆర్చ్‌లు ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్ హౌస్ ను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ రాజభవనాన్ని ఆధీనంలో ఉంచుకొని విదేశాల నుంచి ఎవరైనా అతి ముఖ్యమైన అతిథులు వచ్చినప్పుడు వాళ్లకు ఆతిథ్యం ఇవ్వడానికి ఈ రాజభవనాన్ని ఉపయోగిస్తుంటారు. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఈ హైదరాబాద్ హౌస్ లోనే భారత ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తుండటంతో మరోసారి ఈ చారిత్రక కట్టడం వార్తల్లోకి ఎక్కింది.