ఫుట్బాల్ మాంత్రికుడు, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మూడు రోజుల GOAT Tour లో భాగంగా డిసెంబర్ 15న ఢిల్లీలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకోనున్న మెస్సీకి స్వాగతం పలికేందుకు దేశ రాజధాని ముస్తాబైంది. మెస్సీ పర్యటన సందర్భంగా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. లీలా ప్యాలెస్లో బస మెస్సీ, అతడి ఫ్రెండ్స్ ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న లీలా ప్యాలెస్ హోటల్లో బస చేయనున్నారు. మెస్సీ బృందం కోసం హోటల్లోని ఓ ఫ్లోర్ మొత్తం రిజర్వ్ చేసి ఉంచారు. ప్రెసిడెన్షియల్ సూట్లో మెస్సీ టీమ్ బస చేయనుంది. ఇందులో ఒక్క గది రెంట్ రోజుకు రూ.3.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ప్రైవేట్ మీట్ అండ్ గ్రీట్ ఇదే హోటల్లో కొందరు కార్పొరేట్ ప్రముఖులు, వీఐపీల కోసం ప్రైవేట్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మెస్సీ కలవాలంటే, అతడితో షేక్ హ్యాండ్ చేయాలంటే కోటి రూపాయలు వెచ్చించాలని తెలుస్తోంది. మెస్సీతో ఫోటో దిగాలంటే రూ.10 లక్షలు కట్టాలని ఇప్పటికే గోట్ టూర్ నిర్వాహకులు తెలిపిన విషయం తెలిసిందే. అది కూడా 100 మందికే అవకాశం ఇచ్చారు. తాజాగా ఢిల్లీలో కార్పొరేట్ ప్రముఖులు మెస్సీని కలిసేందుకు కోటి వరకు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీతో భేటీ ఢిల్లీ పర్యటనలో భాగంగా మెస్సీ.. ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత పలువురు ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్, చీప్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రముఖులను మెస్సీ కలవనున్నారు. ఆ తర్వాత సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయం వెళ్లి అక్కడి నుంచి తన దేశానికి మెస్సీ తిరుగు ప్రయాణం కానున్నారు. డిసెంబర్ 15 తో మెస్సీ భారత్లో ది గోట్ టూర్ పూర్తవుతుంది.