Bangladesh Lynching | బంగ్లాదేశ్‌లో రోజురోజుకూ మైనారిటీ హిందువులపై దాడులు పెరుగుతున్నాయి. దానికి ఉదాహరణే గురువారం అర్ధరాత్రి జరిగిన హిందు యువకుడు దీపు చంద్ర దాస్ హత్య. అల్లరి మూకలు అతడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టి చంపి కిరోసిన్ పోసి నిప్పు అంటించారు. ఇంత దారుణంగా అక్కడి ప్రజలు ప్రవర్తించడం దేనికి సంకేతం. మత దూషణకు పాల్పడ్డాడనే ఆరోపణతో 25 ఏళ్ల యువకుడిని అత్యంత కిరాతకంగా అల్లరి మూకలు చంపేశారు. అసలు బంగ్లాదేశ్‌లో లా అండ్ ఆర్డర్ ఉందా? పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఉందా? అంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అసలేం జరిగింది? మైమెన్సింగ్లో ఉన్న ఓ ఫ్యాక్టరీలో దీపు చంద్ర దాస్ పని చేస్తున్నాడు. తన కుటుంబానికి అతడే ఆధారం. ఫ్యాక్టరీలో అతడు మత దూషణకు పాల్పడ్డాడనే వార్తలు వ్యాపించడంతో అదే ఫ్యాక్టరీలో పని చేస్తున్న తోటి కార్మికులు అతడిని ఫ్యాక్టరీ నుంచి బయటికి లాక్కొచ్చారు. ఇంతలో బయటి వ్యక్తులు కూడా తోడై అందరూ కలిసి అతడిపై తీవ్రంగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం అతడి మృతదేహాన్ని హైవేపై పడేసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. రోడ్డున పడ్డ దాస్ కుటుంబం తన కొడుకుపై దాడి జరిగిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న దీపు చంద్ర దాస్ తండ్రి రవిలాల్ దాస్ వెంటనే అక్కడికి చేరుకొని కొడుకు మృతదేహాన్ని చూసి విలపించాడు. నా కొడుకును చెట్టుకు కట్టేసి కొట్టారు. కిరోసిన్ పోసి తగులబెట్టారు. కాలిపోయిన శరీర భాగాలను చూస్తే గుండె తరుక్కుపోతోంది.. అంటూ రవిలాల్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. దీపు చంద్ర దాస్‌కి పెళ్లి అయింది. ఒక పాప కూడా ఉంది. తమ కుటుంబాన్ని రోడ్డున పడేశారని దీపు తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ ఘటనతో బంగ్లాదేశ్‌తో పాటు భారత్‌లో కూడా తీవ్ర వ్యతిరేకత, నిరసనలు వ్యక్తం కావడంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాపిడ్ యాక్షన్ బెటాలియన్ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసింది. ఆనాడు బంగ్లాదేశ్‌కి విముక్తి కల్పిస్తే ఇప్పుడు ఇలా చేస్తారా? ఈ ఘటనపై భారత నేతలు కూడా స్పందించారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్రంగా ఖండించారు. మతం, కులం పేరుతో ఇంకా ఇలాంటి దాడులు జరగడం మానవత్వానికే మాయని మచ్చ అని ప్రియాంకా గాంధీ అన్నారు. 1971 లో భారత సైనికులు తమ రక్తాన్ని ధారబోసి మరీ బంగ్లాదేశ్‌కి విముక్తి కల్పిస్తే నేడు అదే గడ్డపై అమాయక మైనారిటీలు రక్తం చిందించేలా చేయడం అత్యంత బాధాకరం అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.