Bangladesh Violence | అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? ఎందుకిలా అల్లరి మూకలు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు? ఇప్పటికే ఓ హిందూ యువకుడిని పొట్టన పెట్టుకున్న అల్లరి మూక తాజాగా మరో దాడికి తెగబడింది. అసలు బంగ్లాదేశ్లో ప్రభుత్వం ఉందా? శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా? పోలీసులు ఏం చేస్తున్నారు? దేశాన్ని అల్లరి మూకల చేతికి అందించారా? అనే ప్రశ్నలు లేవనెత్తేలా మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. లక్ష్మీపూర్ సదర్ ఉపజిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఓ చిన్నారి బలైంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(BNP) కి చెందిన ఓ నేత ఇంటిని చుట్టుముట్టిన అల్లరి మూక.. ఆ నేత ఇంటి బయటి నుంచి తాళం వేసి ఆ ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆ నేత కూతురు అయిన 7 ఏళ్ల ఆయేషా అక్తర్ సజీవ దహనం అయింది. బీఎన్పీ నేత అయిన బెలాల్ హుస్సేన్.. భవానీగంజ్ యూనియన్ బీఎన్పీ పార్టీ అసిస్టెంట్ ఆర్గనైజర్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఒక వ్యాపారి కూడా. ఆయన ఇంటిపై పక్కా ప్రణాళికతో దుండగులు దాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో బెలాల్ కూడా ఉన్నారు. తన భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంలో బెలాల్, ఆయన ఇద్దరు కుమార్తెలు సల్మా అక్తర్, సమియా అక్తర్లకు తీవ్ర గాయాలయ్యాయి. తన 7 ఏళ్ల కూతురు ఆయేషా అక్కడికక్కడే మంటల్లో కాలి మృతి చెందింది. Bangladesh Violence | ఈ దాడికి పాల్పడింది ఎవరు? అసలు ఈ దాడికి ఎవరు పాల్పడ్డారో ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఏర్పడ్డ నాటి నుంచి బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. హింసాత్మక ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి.