President | హైదరాబాద్ : శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ నగరానికి బుధవారం మధ్యాహ్నం చేరుకున్నారు. హకీంపేట ఎయిర్పోర్టులో రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు స్వాగతం పలికారు. ఈ నెల 21వ తేదీ వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. రాష్ట్రపతి షెడ్యూల్ ఇదే.. డిసెంబంర్ 17 నుంచి 22వ తేదీ వరకు అంటే.. మొత్తం ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేయనున్నారు. డిసెంబర్ 19వ తేదీన రామోజీ ఫిలిం సిటీకి వెళ్లనున్నారు. ఆ రోజు ఉదయం 11.00 గంటలకు ఈ ఫిలిం సిటీ వేదికగా జరగనున్న ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. డిసెంబర్ 20వ తేదీన గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో జరిగే సదస్సుకు ముర్ము హాజరవుతారు. కట్టుదిట్టమైన భద్రత హైదరాబాద్లో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఇప్పటికే ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. సైబరాబాద్ పరిధిలో డ్రోన్లు ఎగురవేతపై పోలీసులు ఆంక్షలు విధించారు. అలాగే అల్వాల్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ల పరిధిలో 17నుంచి 22 వరకు డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో లైట్ ఎయిర్క్రాఫ్టుల ఎగురవేతపై నిషేధం విధించారు. భద్రతా చర్యల్లో భాగంగా బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.