MLC Kavitha | హైదరాబాద్ : తెలంగాణ జాగృతి పోరాటాలతోనే ఐడీపీఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ జాగృతి విజయమేనని ఆమె తేల్చిచెప్పారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా పర్యటన సందర్భంగా ఐడీపీఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణల విషయాన్ని ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారని ఆమె తెలిపారు. ఈ విషయాలనే నేను మీడియా ముఖంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాను.. ప్రభుత్వం స్పందించి విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో కలిపి విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ విచారణలో నిజాలను నిగ్గు తేల్చాలి.. మా కుటుంబంపై రాజకీయ కారణాలతో ప్రత్యర్థులు చేసిన తప్పుడు ఆరోపణలు కూడా తేలిపోతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ విచారణల పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వ భూములను అక్రమార్కుల చెర విడిపించాలి.. ఆ భూములన్నీ ప్రజలకే చెందాలని డిమాండ్ చేస్తున్నానని కవిత పేర్కొన్నారు. అసలు వివాదం ఇది..! ఐడీపీఎల్ భూములపై గత కొంతకాలం నుంచి రాజకీయ రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సుమారు రూ. 4 కోట్ల విలువైన భూములపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత మధ్య పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. మాధవరంతో పాటు ఆయన కుమారుడిపై కవిత ఆరోపణలు చేయగా, కవిత భర్త అనిల్‌పై మాధవరం భూకబ్జా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో సర్వే నంబర్ 376లో ఏం జరిగిందో తేల్చాలంటూ సమగ్ర విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది.