Drugs | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు పేపర్లకే పరిమితం అవుతున్నాయి. డ్రగ్స్ కట్టడికి క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎక్కడంటే అక్కడ.. నగరంలో డ్రగ్స్ దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ లేడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఆమె చిక్కడపల్లి కేంద్రంగా డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు తేలింది. ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కంపెనీలో పని చేస్తున్న ఆమె.. గత కొద్ది రోజుల నుంచి తన ప్రియుడితో కలిసి డ్రగ్స్ దందాకు తెరలేపింది. డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో పాటు మరో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుల నుంచి ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బాటిల్స్, ఓజీ కుష్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ రూ. 4 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.