CP Sajjanar | హైదరాబాద్ : బలవంతపు వసూళ్లు చేస్తే చర్యలు తప్పవని ట్రాన్స్జెండర్లకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని సెల్స్ ఆడిటోరియంలో 250 మంది ట్రాన్స్జెండర్లకు పోలీసులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్ల అరాచకాలు, బలవంతపు వసూళ్లపై వచ్చిన ఫిర్యాదులపై సీపీ సజ్జనార్ వారితో ప్రత్యేకంగా చర్చించారు. ట్రాన్స్జెండర్ల సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్ల మధ్య ఉన్న గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు కారణంగా తరుచుగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని, దీని వల్ల ప్రాణ నష్టం కూడా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ శుభకార్యం జరిగినా.. అక్కడికి వెళ్లి ట్రాన్స్జెండర్లు బలవంతంగా వసూళ్లు చేస్తున్నారని.. వీటి మీద తమకు అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. డిమాండ్ చేసినంత ఇవ్వకపోతే దాడులకు పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు. ఇలాంటి చర్యలు సరికాదని, బలవంతపు వసూళ్లను సహించబోమని ఆయన హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారినైనా జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా మీపై నమోదయ్యే కేసులు మీ భవిష్యత్‌ను నాశనం చేస్తాయని, అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే శిక్షలు తప్పవని తేల్చిచెప్పారు. ట్రాన్స్జెండర్ల వెల్ఫేర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక సమగ్రమైన విధానాన్ని తీసుకురానుందని తెలిపారు.