Ghost Pairing | హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను ఏదో రకంగా మోసం చేస్తూనే ఉన్నారు. సైబర్ నేరాల పట్ల పోలీసులు అప్రమత్తం చేసినప్పటికీ.. ప్రజలు మాత్రం సైబర్ క్రిమినల్స్ ఉచ్చులో చిక్కుకుపోయి ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటికే అనేక రకాల మోసాలకు పాల్పడ్డ సైబర్ నేరగాళ్లు.. తాజాగా సరికొత్త మోసానికి తెరలేపారు. వాట్సాప్‌ను ఆసరా చేసుకున్న సైబర్ క్రిమినల్స్.. ఘోస్ట్ పేయిరింగ్ ( Ghost Pairing ) తో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ఘోస్ట్ పేయిరింగ్ స్కామ్‌పై హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ కీలకమైన సందేశం ఇచ్చారు. "హేయ్.. మీ ఫొటో చూశారా?" అంటూ ఏదైనా లింక్ వచ్చిందా? తెలిసిన వారి నుంచి వచ్చినా సరే.. పొరపాటున కూడా క్లిక్ చేయకండి అని సజ్జనార్ సూచించారు. ఇదొక 'ఘోస్ట్ పేయిరింగ్'(Ghost Pairing) స్కామ్ అని ఆయన తెలిపారు. ఆ లింక్ క్లిక్ చేస్తే నకిలీ వాట్సాప్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఓటీపీ గానీ, స్కానింగ్ గానీ లేకుండానే.. మీకు తెలియకుండా మీ వాట్సాప్ ఖాతా హ్యాకర్ల డివైజ్‌కు కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి వారి చేతికి చిక్కితే.. మీ వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు అన్నీ చూస్తారు. మీ కాంటాక్ట్స్ లిస్ట్ దొంగిలిస్తారు. మీ పేరుతో ఇతరులకు సందేశాలు పంపి మోసాలకు పాల్పడతారు. చివరికి మీ ఖాతాను మీరే వాడలేకుండా లాక్ చేస్తారు అని సజ్జనార్ తెలిపారు. వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద లింక్‌లను అస్సలు క్లిక్ చేయవద్దు. వాట్సాప్ సెట్టింగ్స్‌లో 'Linked Devices' ఆప్షన్‌ను తరచూ పరిశీలించండి. తెలియని డివైజ్‌లు ఉంటే వెంటనే రిమూవ్ చేయండి. Two-step verification తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోండి. ఒక చిన్న అజాగ్రత్తతో మీ వాట్సాప్ మొత్తం హ్యాకర్ల పరమవుతుంది. ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేసి అప్రమత్తం చేయండి అని సీపీ సజ్జనార్ సూచించారు.