Andhra Train Fire | టాటానగర్ నుంచి కేరళలోని ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. ఏపీలోని విశాఖ జిల్లా నుంచి వెళ్తున్న ఈ రైలు ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదానికి గురైంది. ప్యాంట్రీ బోగీకి పక్కనే ఉన్న ఏసీ బోగీలు బీ1, ఎం2 లలో మంటలు చెలరేగాయి. దీంతో ఆ రెండు బోగీలు మంటల్లో కాలిపోయాయి. ఈ విషయాన్ని గుర్తించిన లోకో పైలట్లు వెంటనే ఎలమంచిలి రైల్వే స్టేషన్లో రైలును ఆపేశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినా.. వాళ్లు అక్కడికి చేరుకునే లోపే రెండు బోగీలు మంటలు ఆహుతి అయ్యాయి. మంటలు చెలరేగుతున్నాయని తెలుసుకున్న రైలులోని ప్రయాణికులు భయాందోళనతో రైలు నుంచి దిగి పరుగులు పెట్టారు. మంటల వల్ల రైల్వే స్టేషన్లో భారీగా పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనలో బీ1 బోగీలో ఓ వ్యక్తి సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో రెండు ఏసీ బోగీలలో 158 ప్యాసెంజర్లు ఉన్నారు. రైలును ఆపగానే ఆ ప్రయాణికులంతా వెంటనే రైలు నుంచి కిందికి దిగడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. పూర్తిగా కాలిపోయిన రెండు బోగీలను రైలు నుంచి విడదీసి మిగిలిన బోగీలతో రైలును ఎర్నాకులానికి పంపించారు. మంటలకు గల కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. హెల్ప్ లైన్ నెంబర్స్ ఈ ఘటన గురించి పూర్తి సమాచారం కోసం, ప్రయాణికుల వివరాల కోసం రైల్వే అధికారులు హెల్ప్ లైన్ నెంబర్లను ప్రకటించారు. Elamanchili - 7815909386 Anakapalle - 7569305669 TUNI - 7815909479 Samalkot - 7382629990 Rajahmundry - 088 - 32420541, 088 - 32420543 Eluru - 7569305268 Vijayawada - 0866 - 2575167 అనకాపల్లికి నాలుగు గంటలు ఆలస్యంగా ఈ రైలు అనకాపల్లి రైల్వే స్టేషన్ చేరుకోవడానికి నాలుగు గంటలు ఆలస్యం అయింది. అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికే నర్సింగబల్లి వద్ద బీ1 ఏసీ బోగీలు ముందు మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత మరో బోగీకి మంటలు అంటుకున్నాయి. వెంటనే అక్కడికి చేరుకున్న అనకాపల్లి, నక్కపల్లి, ఎలమంచిలి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించినా రెండు బోగీలు అప్పటికే మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణికుల లగేజ్ కూడా పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం జరగగానే రైలులోని 2 వేల మంది ప్రయాణికులు రైలు దిగి స్టేషన్ లో పడిగాపులు కాచారు. చలిలోనే వణుకుతూ కూర్చున్నారు. ఆగిన విశాఖ- విజయవాడ రూట్ రైళ్లు ఈ ప్రమాదంతో విశాఖపట్టణం, విజయవాడ రూట్లో వెళ్లే రైళ్లన్నీ ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి. తెల్లవారుజామున ఎర్నాకుళం రైలును పంపించిన తర్వాత రైళ్ల రాకపోకలను కొనసాగించారు. ఆ రెండు బోగీలకు చెందిన ప్రయాణికులను సామర్లకోట స్టేషన్ కు తరలించి అక్కడ 2 ఏసీ బోగీలను ఆ ట్రెయిన్కి యాడ్ చేసి అక్కడి నుంచి వాళ్లను ఆ బోగీల్లో ఎర్నాకుళానికి తరలించారు.