దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దు అవడం, ఆలస్యం అవడం ఇంకా ఆగలేదు. ఇప్పటికే మూడు నాలుగు రోజులు దాటినా విమానాల రద్దు మాత్రం జరుగుతూనే ఉంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. తాజాగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ విమానాలు రద్దు కావడంతో ఆగ్రహించిన ప్రయాణికులు ఇండిగో టికెట్ కౌంటర్ వద్ద సిబ్బందితో గొడవకు దిగారు. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన ఇండిగో విమానాల్లో చాలా విమానాలు రద్దయ్యాయి. శనివారం 100కు పైగా విమానాలు రద్దు అయ్యాయి. దీంతో విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇండిగో సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం, సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ కౌంటర్ల వద్ద ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిని నిలదీయడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ఒక ముంబై ఎయిర్‌పోర్ట్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న చాలా విమానాశ్రయాల్లో ఇదే పరిస్థితి. కొత్త పైలట్ రోస్టర్ నిబంధనల అమలులో లోపాల వల్లనే దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దు అవుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇండిగో విమానయాన సంస్థ విషయంలో సీరియస్ గా స్పందించింది. రద్దయిన విమానాలకు సంబంధించిన టికెట్ రుసుము రీఫండ్ వెంటనే చెల్లించాలని, విమాన టికెట్ ధరలను కూడా నియంత్రించాలని ఆదేశాలు జారీ చేసింది.